ఏపీలో కొవిడ్ కలకలం.. కడప జిల్లాలో కరోనాతో 46 ఏళ్ల వ్యక్తి మృతి

ఏపీలో కొవిడ్ కలకలం.. కడప జిల్లాలో కరోనాతో 46 ఏళ్ల వ్యక్తి మృతి

ఏపీలో మరోసారి కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పక్క జిల్లా అయిన కడపలో ఇటీవల ఐదు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. దీంతో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తవుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి గతంలోలాగా తీవ్రంగా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మూలాలు ఏపీలో మళ్లీ బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా మహ్మమారి సోకి ఆంధ్రప్రదేశ్‎లోని కడప జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి రవిబాబు వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన ఓ 46 ఏళ్ల వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. 

ఎక్స్-రే తీయగా బాధితుడు రెండు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడం వల్ల న్యుమోనియా వచ్చినట్లు తేలింది. నాలుగు రోజుల పాటు అధిక మోతాదులో యాంటీబయాటిక్ చికిత్స చేసిన తర్వాత కూడా వ్యాధి నయం కాలేదు. దీంతో సిటీ స్కానింగ్ తీయగా కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చేరిన నాలుగు రోజుల తర్వాత ఆరోగ్యం విషమించడంతో పేషెంట్ మృతి చెందాడు. 

మృతుడికి మద్యపానం అలవాటు ఉందని తెలిపారు. శానిటైజేషన్, మృతుని ప్రాథమిక, ద్వితీయ కాంటాక్టులను గుర్తించడం వంటి నివారణ చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా బారిన పడి రాష్ట్రంలో ఓ వ్యక్తి మరణించడంతో మహ్మమారి మళ్లీ వచ్చిందా అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, కరోనా ప్రస్తుత పరిస్థితి గతంలోలాగా తీవ్రంగా ఉండదని.. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.